Jignasa

Lata Mangeshkar: స్వరరాగ గంగా ప్రవాహం.. రూపాయి జీతం కూడా తీసుకోని ఏకైక ఎంపీ!

లతా మంగేష్కర్‌… ఆమె ఆసలు పేరు ‘హేమ’. హేమ అంటే బంగారం. ఆమె గాత్రమే కాదు… ఆమె వ్యక్తిత్వమూ బంగారమే. ముప్పై ఆరు ప్రాంతీయ, కొన్ని విదేశీ భాషల్లో కలిపి 27వేల చలన చిత్ర గీతాల్లో ఆమె మనకు వినిపిస్తారు. మనసులను తన స్వరంతో వికసింపజేస్తారు. గాయనీగాయకులకు అతి కష్టమైన మూడోశృతిని అలవోకగా ఆలపించగల సామర్థ్యం ఆమెకు లభించిన వరమే కాదు.. ప్రపంచ సంగీత అభిమానుల అదృష్టం. ఆమె రాగాలు మన మనసును ఉత్తేజితం చేస్తే… ఆమె జీవనయానం మన హృదయాల్లో స్ఫూర్తి నింపుతుంది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచిన లతా జీవన గీతాసారం… మీ కోసం…

లతాజీ పుట్టింది ఇండోర్‌లో… ఆమె తండ్రి పేరు దీనానాథ్‌ మంగేష్కర్‌. ఆయన గాయకుడే గాక, రంగస్థల నటుడు. తల్లి శేవంతీ మంగేష్కర్‌. తండ్రి రాసిన ‘భవబంధన్‌’ నాటకంలోని నాయకి పేరు ‘లతిక’. ఆ పాత్రను చూసిన లతాజీ తన పేరును లతా మంగేష్కర్‌గా మార్చుకున్నారు. తండ్రి నడుపుతున్న నాటకాల కంపెనీలో ప్రదర్శించే సంగీత ప్రధానమైన నాటకాలలో లతా నటించడమే కాక, పాటలూ పాడేవారు. కూతురిలోని గాయనిని మొదట గుర్తించింది ఆమె తండ్రే. 5వ ఏట నుంచే నటించడం మొదలు పెట్టారామె. స్కూల్‌కి వెళ్లి తోటి విద్యార్థినులకు ఆమె పాటలు నేర్పేవారు. దీన్ని గమనించిన టీచర్‌ ఆమెను బడికి రావద్దని చెప్పేశారు. అయితే లత బడికి వెళ్లడం మానేశారు. ఈ టీచర్‌ మందలింపులు వలన కాదని, తన చెల్లెలు ఆశాభోంస్లేను తనతో పాటుగా బడికి రానివ్వకపోవడం వల్లనే అని లతా మంగేష్కర్‌ ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ముఖాముఖిలో చెప్పడం విశేషం. చెల్లికోసం… పాట కోసం అప్పుడే ‘త్యాగ’రాగం అందుకున్నారామె.

స్ఫూర్తి గీతం

తొలి గురువైన తండ్రి సంగీత సప్తస్వర జ్ఞానం అందిస్తే, ఉద్ధండ హిందుస్థానీ సంగీత గురువులైన అమన్‌ అలీఖాన్, అమానత్‌ ఖాన్ల వద్ద శిష్యరికం చేసి ఆమె గానకోకిలగా మారారు. ఆమెకు 13 ఏళ్ల వయసులో అంటే 1942లో ‘కిటి హస్సల్‌’ అనే మరాఠీ చిత్రం కోసం మొదటిసారిగా రికార్డింగ్‌ స్టూడియోలో తన తొలి చలన చిత్ర పాటను రికార్డు చేశారు. దురదుష్టవశాత్తూ ఆ చిత్రం విడుదలకి నోచుకోలేదు. ఈ చిత్రంలో ఆమె రెండు పాటలు పాడారు. వీటిలో ‘నాచు యా గాదే’ అనే పాటను చిత్రం నిడివి పెరిగిందని ఎడిట్‌ చేశారు. రెండో పాట ‘నటాలీ చైత్రాచి నవలాయ్‌’ మాత్రం లత తొలి మరాఠి పాటగా గ్రామ్‌ఫోన్‌ రికార్డుల్లోకి ఎక్కింది. తొలి ప్రయత్నంలో విఫలమైనా, నిరాశపడకూడదనే ‘స్ఫూర్తి’ గీతానికి తనే నిదర్శనంగా నిలిచారు.

గెలుపు స్వరం

1942లో తండ్రి చనిపోగానే కుటుంబ పెద్దగా మీనా, ఆశా, ఉషా మంగేష్కర్‌ అనే ముగ్గురు చెల్లెళ్ల, తమ్ముడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ పోషణా లతాజీ భుజాలపైన పడ్డాయి. 1948 వరకూ లతాజీ పాటలనే నమ్ముకోకుండా ఎనిమిది చిత్రాలలో నటిగా వేషాలువేసి కుటుంబాన్ని లాక్కొచ్చారు. నూర్జహాన్, షంషాద్‌ బేగం లాంటి గాయనీగాయకుల కంఠస్వరాలను విన్న సంగీత దర్శకులకి లతాజీ పక్వత చెందని స్వరం పీలగా-కీచుగా అనిపించి ఆమెను మొదట్లో తిరస్కరించారు. 1949లో ‘మహల్‌’ చిత్రంలో ఆమె పాడిన ‘ఆయేగా ఆనేవాలా’ పాటతో లతా సుడి తిరిగింది. సంగీత దర్శకులంతా ఆమె చుట్టూ తిరగడం మొదలైంది. వద్దన్నే చోటే విజయం సాధించాలని ‘గెలుపు’ స్వరం వినిపించారామె.

ఓదార్పు పాట.

1953లో లతకు తొలి ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. కానీ ఆమె సున్నిత మనస్తత్వం కారణంగా స్టేజి మీదకు వచ్చి దానిని తీసుకోవడానికి తిరస్కరించారు. న్యాయనిర్ణేతలు అందుకు కారణం చెబితే సరిదిద్దుకోగలమని హామీ ఇవ్వడంతో ‘‘వస్త్రాలు లేని ఒక నగ్న స్త్రీ ప్రతిమను ఒక సంప్రదాయ భారత స్త్రీగా అందుకోలేనని’’ ఆమె చెప్పారు. అప్పుడు ఆ అవార్డు ప్రతిమకు ఒక జేబురుమాలును చుట్టి ఇవ్వగా అప్పుడామె దానిని స్వీకరించారు. 1962లో చైనా యుద్ధంలో ఓడిన జవానులను ఓదార్చుతూ లతాజీ పాడిన ‘ఆయె మేరీ వతన్‌కి లోగొం’ అనే పాటను విని కంట తడి పెట్టానని నెహ్రూ ఆమెతో స్వయంగా చెప్పడం విశేషం.

1942 నుంచి 2015దాకా అంటే అవిశ్రాంతంగా 73 ఏళ్లపాటు స్వర గాన యజ్ఞం చేసిన రికార్డు లత సొంతం. 1990లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది. ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి తరువాత భారతరత్న పురస్కారం అందుకొన్న రెండో గాయనీ లతాయే. అందుకే ఆమె జీవితం స్వరరాగ గంగా ప్రవాహం…ఆమె వ్యక్తిత్వం జీవన ఆదర్శ ప్రభాతం.

  • లతకి ఇష్టమైన అట క్రికెట్‌.. లార్డ్స్‌ స్టేడియంలో ఆమెకి ప్రత్యేకమైన, శాశ్వతమైన గ్యాలరీ ఉందని చాలామందికి తెలియదు.
  • రాజ్యసభ ఎంపీగా ఉన్నకాలంలో ఒక్క రూపాయి జీతం కూడా తీసుకొని ఏకైక ఎంపీ ఆమె.
  • సంగీత దర్శకులు అందరిలో మదన్‌మోహన్‌ అంటే ఆమెకి ప్రత్యేకమైన సోదరాభిమానం. అందుకు తగినట్టుగానే ఆయన లతకు గొప్ప ఖ్యాతి తెచ్చిన గీతాలకి స్వరకల్పన చేశారు.